జన బాంధవుడికి ఘన నివాళి..
యావద్భారతం కన్నీటి పర్యంతం.. గురువారం అంత్యక్రయలు
- విమానంలో ఢిల్లీకి భౌతికకాయం.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి
- ఊరేగింపుగా 10 రాజాజీ మార్గ్ నివాసానికి తరలింపు
భారత
రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన క్షిపణి పితామహుడు.. గగనతలంలో భారత
కీర్తిపతాకను రెపరెపలాడించిన శాస్త్రవేత్త... జాతి జనుల మనసులో చెరగని
ముద్ర వేసిన ప్రజల రాష్ట్రపతి.. దివంగత అబ్దుల్ కలాంకు జాతి ఘననివాళి
అర్పించింది. దేశాన్ని శోకసముద్రంలో ముంచి నింగికేగిన అసామాన్యుడికి
అశ్రునివాళులర్పించేందుకు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ తరలివచ్చారు.
సోమవారం షిల్లాంగ్‌లో తుది శ్వాస విడిచిన అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని
మంగళవారం ఉదయం వైమానికదళ హెలికాప్టర్‌లో తొలుత గువాహటికి తరలించారు.
గువాహటిలో అసోం సీఎం తరుణ్ గొగోయ్ మాజీ రాష్ట్రపతికి నివాళులర్పించారు.
అనంతరం భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని గువాహటి
నుంచి ఢిల్లీ పాలం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. కలాం భౌతికకాయం వెంట
మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్, రాష్ట్ర హోం మంత్రి రోషన్ ఉన్నారు.
సన్నని జల్లులతో వరుణ దేవుడు సైతం ఆ మానవతామూర్తికి నివాళులర్పించాడు.
పాలం విమానాశ్రయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్
అన్సారీ, ప్రధాని మోదీ తదితరులు కలాం భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి
నివాళులర్పించారు. మువ్వన్నెల జెండాలో నిశ్చల ముద్రలో ఉన్న కలాం
భౌతికకాయానికి జవాన్లు గౌరవవందనం చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్,
త్రివిధ దళాధిపతులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ
సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు కలాంకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం
కలాం భౌతికకాయాన్ని పూలతో అలంకరించిన శకటంలో ఉంచి 12 కిలోమీటర్ల దూరంలో
ఉన్న 10 రాజాజీ మార్గ్ నివాసానికి ఉరేగింపుగా తరలించారు. కాగా, మంగళవారం
ఉదయం భేటీ అయిన కేంద్ర కేబినెట్ మాజీ రాష్ట్రపతి మృతికి సంతాపం
తెలిపింది. ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించింది.
No comments:
Post a Comment